డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: క్షుద్ర పూజలు, చేతబడుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు దొంగ బాబాలను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.30.50 లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, పూజలకు వాడే బెల్లం బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వివరాల ప్రకారం.. కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన తురుపాటి శ్యాం కుమార్ (57) ప్రస్తుతం హైదరాబాద్ తూముకుంటలో ఉంటూ భద్రకాళి పూజ స్టోర్ నడుపుతున్నాడు. అగ్రహారం గ్రామానికి చెందిన పత్తెం లక్ష్మీరాజం (60) తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.
హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన బండారి లత అనే మహిళ దీర్ఘకాలిక అనారోగ్యంతో వీరి వద్దకు రాగా.. క్షుద్ర పూజలతో నయం చేస్తామని నమ్మించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సిరిసిల్ల పాత బస్ స్టాండ్ వద్ద రూ.10 లక్షలు, యాదగిరిగుట్టలో రూ.21 లక్షలు, కాశీలో రూ.13 లక్షలు, బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.62 లక్షలు.. మొత్తం కోటి రూపాయలకు పైగా వసూలు చేశారు.
డబ్బులు అడిగితే తెల్ల కాగితాలపై సంతకాలతో బ్లాక్ మెయిల్ చేసి, చేతబడి చేసి కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. పొలంలో గుప్త నిధులు ఉన్నాయని మభ్యపెట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు (Cr.No 478/2026) నిందితులను అగ్రహారంలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, అనారోగ్యానికి సరైన వైద్యం తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.